: నీరు లేక అల్లాడి, అంతరించిపోయిన భారీ మెమత్ లు
జురాసిక్ పార్క్, 1000 బీసీ వంటి హాలీవుడ్ సినిమాల్లో కనువిందు చేసిన మెమత్ (భారీ ఏనుగులు) లపై చేసిన పరిశోధనల్లో విస్మయకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. మెమత్ లు 10,500 ఏళ్ల క్రితమే ప్రపంచ వ్యాప్తంగా అంతరించిపోయాయని ఇంతవరకూ భావిస్తూ వచ్చారు. అయితే ఇవి అలస్కా తీరంలోని మారుమూలనున్న సెయింట్ పౌల్ ద్వీపాల్లో 5,600 ఏళ్ల క్రితం వరకూ జీవించాయని పెన్సిల్వేనియా వర్సిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. ఈ దీవుల్లో మెమత్ లు దాహంతో అల్లాడి మరణించాయనే విస్మయకరమైన వాస్తవాన్ని వారు వెలుగులోకి తెచ్చారు. అప్పటి వాతావరణంలో సంభవించిన మార్పుల కారణంగా వేడి కమ్ముకుందని, దీంతో మెమత్ లు నివసించే దీవులు క్రమంగా కుంచించుకుపోగా, మరికొన్ని మంచి నీటి వనరులు సముద్ర గర్భంలో కలిసిపోయాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న రషెల్ గ్రాహం తెలిపారు. వాతావరణం వేడెక్కడంతో మిగిలినవి ఎండిపోయాయని ఆయన వెల్లడించారు. దీంతో తాగేందుకు నీరు లేక దాహంతో అల్లాడి మెమత్ లు అంతరించిపోయాయని ఆయన తెలిపారు. తాజాగా ప్రపంచ వ్యాప్తంగా సంభవిస్తున్న వాతావరణ మార్పులతో కొన్ని ద్వీపాల్లో అప్పటి పరిస్థితి మళ్లీ సంభవించే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం సంభవిస్తున్న మార్పులు జంతువులు, మనుషులపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన తెలిపారు.