: రాజ్యసభలో తొలి ప్రశ్న వేయడానికి సచిన్ కు మూడేళ్లు పడితే!... 3 నెలల్లోనే గళం విప్పిన మేరీ కోమ్!
పార్లమెంటులో పెద్దల సభగా పిలుస్తున్న రాజ్యసభలో అడుగుపెడుతున్న క్రీడాకారుల్లో కొందరు పేలవ ప్రదర్శన కనబరిస్తే... మరికొందరు మాత్రం ఆటలో మాదిరిగానే సభలోనూ ప్రజా ప్రతినిధులుగా సత్తా చాటుతున్నారు. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత మూడేళ్లకు గాని ఓ ప్రశ్నను సంధించలేకపోయారు. అంతేకాక పార్లమెంటు సమావేశాలకు హాజరు శాతంలోనూ ఆయన వెనుకబడిపోయారు. సచిన్ కు భిన్నంగా ఇటీవలే రాజ్యసభకు ఎన్నికైన ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్... మూడంటే మూడు నెలల్లోనే తొలి ప్రశ్న సంధించి ఔరా అనిపించారు. రియో ఒలింపిక్స్ కు అవకాశం దక్కని మేరీ కోమ్... అక్కడికి వెళుతున్న భారత క్రీడాకారులకు మాత్రం రాజ్యసభ సాక్షిగా విషెస్ చెప్పారు. అంతేకాకుండా సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ఓ అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఇంటర్నేషనల్ ఈవెంట్లకు వెళ్లే భారత క్రీడాకారులకు మరిన్ని సౌకర్యాలు కల్పించాలని ఆమె ప్రభుత్వానికి విన్నవించారు. అంతేకాకుండా శిక్షణా సమయాల్లోనూ క్రీడాకారులకు అవసరమైన మేర పోషకాహారాన్ని అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. మేరీ కోమ్ సూచనలకు సానుకూలంగా స్పందించిన కేంద్ర క్రీడల శాఖ మంత్రి విజయ్ గోయల్... క్రీడాకారులపై మరింత శ్రద్ధ పెడతామని ప్రకటించారు.