: తెలంగాణ మంత్రి ఈటల కాన్వాయ్ లో ఒకదానికొకటి ఢీకొన్న వాహనాలు!... తప్పిన ముప్పు!
తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ కాన్వాయ్ లో నేటి ఉదయం ప్రమాదం సంభవించింది. కరీంనగర్ లో నేటి ఉదయం తన ఇంటి నుంచి బయలుదేరిన ఈటల కాన్వాయ్ లోని వాహనాలు ఒకదానితో మరొకటి ఢీకొన్నాయి. ఈ క్రమంలో కాన్వాయ్ లోని ఓ కారు ధ్వంసమైంది. అయితే ఈ ప్రమాదంలో మంత్రి ఈటల సహా ఏ ఒక్కరికి గాయాలు కాలేదు. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు హుటాహుటిన అక్కడకు చేరుకోగా మంత్రికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలు తెలియరాలేదు.