: జగ్గీ వాసుదేవ్ ఇద్దరు యువతులను బందీలుగా పట్టుకున్నారట!... తమిళనాట వృద్ధ దంపతుల సంచలన ఆరోపణ!
ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ఈషా యోగా సెంటర్ స్థాపకుడు జగ్గీ వాసుదేవ్ వార్తల్లోకెక్కారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కోరిక మేరకు గతంలో ఏపీ ఎమ్మెల్యేలకు యోగాపై శిక్షణా తరగతులు నిర్వహించిన జగ్గీ వాసుదేవ్ పై తమిళనాట ఓ వృద్ధ దంపతులు సంచలన ఆరోపణలు చేశారు. తమకున్న ఇద్దరు కూతుళ్లను వాసుదేవ్ బందీలుగా పట్టుకున్నారని ఆ దంపతులు ఏకంగా కోయంబత్తూరు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా పెళ్లి కాని తమ ఇద్దరి కూతుళ్లను జగ్గీ వాసుదేవ్ వివాహం చేసుకునేందుకు యత్నిస్తున్నారని వారు చేసిన ఆరోపణలు పెను సంచలనమే రేపుతున్నాయి. వివరాల్లోకెళితే... కోయంబత్తూరు జిల్లాలోని వాడవల్లికి చెందిన కామరాజ్ దంపతులకు గీతా కామరాజ్ (33), లతా కామరాజ్ (31) అనే ఇద్దరు కూతుళ్లున్నారు. గీతా ఎంటెక్ దాకా చదవగా, లతా బీటెక్ పూర్తి చేసింది. ఇటీవల యోగా నేర్చుకునేందుకు వారిద్దరూ కోయంబత్తూరులోని జగ్గీ వాసుదేవ్ ఆధ్వర్యంలోని ఈషా యోగా సెంటర్ కు వెళ్లారు. ఈ క్రమంలో వారిని పూర్తిగా మార్చేసిన జగ్గీ వాసుదేవ్... వారిని సన్యాసులుగా మార్చే యత్నం చేశారట. ఈ క్రమంలో వారిని అసలు తన ఆశ్రమం గేటు దాటనీయడం లేదు. అంతేకాకుండా తన కూతుళ్లతో కామరాజ్ మాట్లాడేందుకు కూడా వాసుదేవ్ అనుమతించడం లేదట. దీంతో కామరాజ్ నిన్న సతీసమేతంగా నేరుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని తన కూతుళ్ల పరిస్థితిపై కలెక్టర్ కు ఓ వినతి పత్రం సమర్పించారు. ఉన్నత విద్యావంతులైన తన కూతుళ్లకు తాను పెళ్లిళ్లు చేయాలనుకుంటుంటే, ఆయన వారిని సన్యాసులుగా మార్చేందుకు యత్నిస్తున్నారని ఆ వినతి పత్రంలో ఆరోపించారు. తక్షణమే ఈ విషయంలో జోక్యం చేసుకుని జగ్గీ వాసుదేవ్ కబంద హస్తాల నుంచి తన ఇద్దరు కూతుళ్లకు విముక్తి కల్పించాలని ఆయన కలెక్టర్ ను కోరారు.