: మహారాష్ట్రలో వర్ష బీభత్సం!... వంతెన కూలి 4 కార్లు, 2 బస్సులు గల్లంతు!
మహారాష్ట్రలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. మంగళవారం రాత్రి భారీ వర్షం కారణంగా ఆ రాష్ట్రంలో ఓ ఘోర ప్రమాదం సంభవించింది. నాలుగు కార్లు, రెండు బస్సులు నీటిలో కొట్టుకుపోయిన సదరు ఘటనకు సంబంధించిన వార్త కాస్త ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ ప్రమాదంలో 30 మంది గల్లంతయ్యారన్న సదరు వార్త మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. వివరాల్లోకెళితే... మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సావిత్రి నది పొంగిపొరలుతోంది. ఈ నదిపై మహారాష్ట్ర- గోవాల మధ్య హైవేపై ఉన్న ఓ బ్రిడ్జి ఉన్నపళంగా కుప్పకూలింది. ఆ సమయంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న నాలుగు కార్లు, రెండు బస్సులు నీటిలో కొట్టుకుపోయాయి. వీటిలోని 30 మంది గల్లంతయ్యారు. ఓ రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ప్రమాదంపై మహారాష్ట్ర ప్రభుత్వం గాలింపు చర్యలను ప్రారంభించింది. అంతేకాకుండా మహారాష్ట్ర- గోవా మధ్య రాకపోకలను నిలిపివేసింది.