: టీడీపీ వైపు దేవినేని నెహ్రూ, బూరగడ్డ చూపు?... కృష్ణా జిల్లాలో టీడీపీకి మరింత బలం!


ఏపీలో అధికార పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే విపక్షం వైసీపీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు టీడీపీలో చేరిపోయారు. మరింత మంది వైసీపీ నేతలు కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నేతలు కూడా టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చేరికలతో ఏపీలో కీలక జిల్లాగా ఉన్న కృష్ణా జిల్లాలో టీడీపీ మరింత బలోపేతం కానుందన్న వాదన వినిపిస్తోంది. ఆ వివరాల్లోకెళితే... కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కృష్ణా జిల్లా నేత దేవినేని నెహ్రూ టీడీపీ వైపు చూస్తున్నారు. గతంలో టీడీపీలోనే ఉన్న ఆయన పార్టీ చీలిక నేపథ్యంలో ఎన్టీఆర్ తరఫున నిలిచారు. ఆ తర్వాత నెహ్రూ కాంగ్రెస్ లో చేరిపోయారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ ప్రాభవం కొడిగడుతుండటం నెహ్రూను డైలమాలో పడేసింది. ఈ నేపథ్యంలో తన సొంత గూటికి చేరేందుకు ఆయన సన్నాహాలు చేసుకుంటున్నారట. ఇక అదే జిల్లాకు చెందిన మరో సీనియర్ రాజకీయవేత్త, కాంగ్రెస్ పార్టీకే చెందిన బూరగడ్డ వేదవ్యాస్ కూడా టీడీపీ వైపు చూస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఓ దఫా అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా పనిచేసిన వేదవ్యాస్ రెండు రాష్ట్రాల ప్రజలకు చిరపరచితులే. మెగాస్టార్ చిరంజీవి రాజకీయ తెరంగేట్రంతో మొగ్గతొడిగిన ప్రజారాజ్యం పార్టీలో చేరిన వేదవ్యాస్.. ఆ తర్వాత తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేశారు. ప్రత్యక్ష రాజకీయాలకు కాస్తంత దూరంగా ఉంటున్న వేదవ్యాస్ తిరిగి యాక్టివేట్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. రాష్ట్రంలో రెండు ప్రధాన సామాజిక వర్గాలకు చెందిన వీరిద్దరూ టీడీపీలో చేరితే... కృష్ణా జిల్లాలో ఆ పార్టీ మరింత బలోపేతం కానుందన్న వాదన వినిపిస్తోంది.

  • Loading...

More Telugu News