: ఎయిర్ పోర్టు నుంచే ఆసుపత్రికి సోనియా గాంధీ!... ప్రైవేటు హాస్పిటల్ లో కాంగ్రెస్ అధినేత్రికి చికిత్స!
ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించేందుకు నిన్న బయలుదేరి వెళ్లిన కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా తన పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్న సంగతి తెలిసిందే. పర్యటన మధ్యలోనే తిరుగుపయనమైన సోనియా గాంధీ ఆరోగ్యంపై ఆందోళన చెందిన ఆమె కుమారుడు రాహుల్ గాంధీ, అల్లుడు రాబర్ట్ వాద్రా ఢిల్లీ ఎయిర్ పోర్టుకు పరుగులు పెట్టారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉంచిన అంబులెన్స్ లో సోనియా గాంధీని నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె సదరు ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ప్రమాదమేమీ లేదని వైద్యులు తెలిపినట్లు సమాచారం. అయితే సోనియా గాంధీ ఏ తరహా అనారోగ్యానికి గురయ్యారన్న విషయం మాత్రం వెల్లడి కాలేదు. అనారోగ్యంతో సోనియా గాంధీ వారణాసి పర్యటనను అర్థాంతరంగా ముగించుకున్నారన్న వార్త కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కలకలమే రేపింది.