: 178 బంతులకు నాలుగు పరుగులు... టెస్టు క్రికెట్ చరిత్రలో ఆస్ట్రేలియా ఆటగాళ్ల సరికొత్త రికార్డు!
శ్రీలంక సిరీస్ లో భాగంగా జరిగిన మొదటి టెస్ట్ లో ఆసిస్ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ పరాజయంతో ఆస్ట్రేలియా ఆటగాళ్లు సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పారు. 268 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగుకు దిగిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు 83.3 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌట్ అయ్యారు. దీంతో 106 పరుగుల తేడాతో శ్రీలంక ఘనవిజయం సాధించింది. అద్భుతమైన సంయమనం ప్రదర్శించిన ఆస్ట్రేలియా బ్యాట్స్ మన్ ఈ మ్యాచ్ ద్వారా అరుదైన ప్రపంచ రికార్డు నమోదు చేశారు. తొమ్మిదో వికెట్ కు ఏకంగా 178 బంతులు ఎదుర్కొన్న ఆసీస్ ఆటగాళ్లు కేవలం నాలుగు పరుగులు మాత్రమే చేశారు. 115 బంతులెదుర్కొన్న పీటర్ నెవిల్ 9 పరుగులు చేయగా, స్టీవ్ ఒకీఫ్ 98 బంతుల్లో 4 పరుగులు చేశారు. అయితే వీరిద్దరూ కలిసి 178 బంతులెదుర్కొని కేవలం నాలుగు పరుగులు చేశారు. దీంతో ఇది సగటు రన్ రేట్ 0.13 కాగా, ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత నిదానమైన రన్ రేట్ ఇదే కావడం విశేషం. డిసిల్వా బౌలింగ్ లో చండీమల్ కు క్యాచ్ ఇచ్చి నెవిల్ పెవిలియన్ చేరగా, స్టీవ్ ఒకీఫ్ ను హెరాత్ బౌల్డ్ చేశాడు. లేకపోతే వీరెన్ని పరుగులు చేసేవారో! మొత్తానికి వీరిద్దరూ కలిసి టెస్టు మజాను ఆస్వాదించడం విశేషం.