: నేను పుష్కర స్నానం చేసిన ఘాట్ లోనే కాదు.. ఏ ఘాట్ లో చేసినా పుణ్యం వస్తుంది: చంద్రబాబు


‘నేను పుష్కర స్నానం చేసిన ఘాట్ లోనే కాదు, ఏ ఘాట్ లో చేసినా పుణ్యం వస్తుంది’ అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. విజయవాడ నుంచి గుంటూరు వరకు చాలా ఘాట్లు ఉన్నాయని ఏ ఘాట్ లో చేసినా భక్తులకు పుణ్యమొస్తుందని అన్నారు. తాను ఏ ఘాట్ లో స్నానం చేసేది కూడా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ, ‘గోదావరి పుష్కరాలు నిర్వహించాం.. అదొక చరిత్ర. గోదావరి అంత్య పుష్కరాలకు నేను హాజరవుతున్నాను. ఈ నెల 12 నుంచి కృష్ణా పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. పుష్కరుడు రెండు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ లో గోదావరి, కృష్ణా నదుల్లోనే ఉండటమనేది చాలా పవిత్రంగా భావిస్తున్నాను. ఈ రెండు సంవత్సరాలు చాలా పవిత్రమైనవి. పుష్కరాలనగానే ప్రతిఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రకృతితో అనుసంధానం కావడం. అదేమాదిరిగా ఏ నది అయితే మనకు జీవనోపాధి కల్పిస్తున్నదో దాని రుణం తీర్చుకోవడం. కృష్ణా పుష్కరాల కోసం ఇప్పటివరకు 156 ఘాట్లు తయారు చేశాము. వాటి సంఖ్య ఇంకా పెరుగుతుంది. ఈ నెల 4వ తేదీ కల్లా పుష్కర పనులు పూర్తికావాలని ఆదేశించాము. నాసిరకం పనులు చేస్తే చర్యలు తప్పవు. పుష్కర ఘాట్లను నాలుగు రకాలుగా విభజించాం. పున్నమి ఘాట్ ను వీఐపీ ఘాట్ గా పెట్టాం. కొన్ని లోకల్ ఘాట్లు కూడా ఉన్నాయి. ‘ఏ+’ ఘాట్ కు ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తున్నాం. ప్రతి 150 మీటర్లకు ఒక డిప్యూటీ కలెక్టర్ ను ఇన్ చార్జిగా పెట్టి, మల్టీ ఫంక్షనల్ టీమ్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఫైర్ సర్వీస్, ఫిషరీస్, హెల్త్, పోలీస్, రెవెన్యూ, ఎండోమెంట్ తదితర శాఖల వారితో ఈ టీమ్ ను ఏర్పాటు చేస్తాం. పుష్కర ఘాట్లలో కావాల్సిన అన్ని పనులను చేస్తారు. మూడు షిఫ్ట్ లలో ముగ్గురు ఆఫీసర్లు పనిచేస్తారు. ఈ నెల 11వ తేదీన గోదావరి అంత్య పుష్కరాలు చేస్తాం. అదేరోజు సాయంత్రం విజయవాడ వచ్చి కృష్ణా పుష్కరాలకు కర్టెన్ రైజర్ కార్యక్రమం ప్రారంభిస్తాం. అదేరోజు రాత్రి 9.20 గంటలకు పుష్కరుడు కృష్ణా నదికి వస్తున్నాడు. ఆ మర్నాడు పవిత్ర స్నానాలు ప్రారంభమవుతాయి. ఈ సందర్భంగా వెయ్యి మంది జానపద కళాకారులతో ఒక ర్యాలీ నిర్వహిస్తున్నాము. నాడు గోదావరి పుష్కరాల సందర్భంగా అఖండ హారతి ఇచ్చాము. కృష్ణా పుష్కరాల సందర్భంగా ఇక్కడ పవిత్రహారతిని ఇస్తున్నాము. ఈ హారతి కార్యక్రమం 11వ తేదీ సాయంత్రం ఫెర్రీ ఘాట్ వద్ద ప్రారంభమవుతుంది. పీఠాధిపతులు శ్రీ జయేంద్ర సరస్వతి, శ్రీ విజయేంద్ర సరస్వతిలు కలిసి 12వ తేదీ ఉదయం దుర్గా ఘాట్ వద్ద పుష్కరాలను లాంఛనంగా ప్రారంభిస్తారు’ అని చంద్రబాబు వివరించారు. ఎన్ని గంటలకు పుష్కర స్నానాలు ప్రారంభమవుతాయనే విషయం పెద్దగా అవసరం లేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.

  • Loading...

More Telugu News