: కమీషన్లకు కక్కుర్తి పడకండి... రాష్ట్ర ప్రజలకు ద్రోహం చెయ్యకండి: చలసాని శ్రీనివాస్
కమీషన్లకు కక్కుర్తి పడి రాష్ట్ర ప్రజలకు అన్యాయం చెయ్యకండని ప్రత్యేకహోదా సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ రాష్ట్ర నేతలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, రాజ్యసభలో పోరాడినట్టుగా బిల్డప్ ఇచ్చి... చర్చల పేరుతో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్ జైట్లీల కేబిన్లలోకి వెళ్లి, వారికి జేజేలు కొడుతున్నారని ఆరోపించారు. స్వప్రయోజనాల కోసం రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేకహోదా సాధనపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా జీఎస్టీ బిల్లును అడ్డుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జీఎస్టీ బిల్లుకు మద్దతిచ్చే ఏ నేత అయినా రాష్ట్ర ద్రోహి అని ఆయన స్పష్టం చేశారు. ఫోన్లు చేశారు, హామీలు ఇచ్చారని చెబుతున్న టీడీపీ నేతలు ఎందుకు ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన నిలదీశారు. రాజ్యసభ సాక్షిగా ప్రధాని ఇచ్చిన హామీకి చట్టబద్ధత లేదని బీజేపీ నేతలు అంటున్నప్పుడు, వారిచ్చిన హామీలు ఎలా నేరవేరుస్తారని ఆయన నిలదీశారు. ప్రజలకు ద్రోహం చేయవద్దని ఆయన సూచించారు.