: ప్రత్యేక హోదాపై రాజీలేదు... అయినా అదొక్కటే చాలదు!: సుజనా చౌదరి
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఒక్కటే చాలదని కేంద్ర మంత్రి సుజనా చౌదరి మళ్లీ పాతపాటే పాడారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదాపై పోరాడుతామని, రాజీపడే ప్రసక్తి లేదని తెలిపిన ఆయన, ప్రత్యేకహోదా సాధిస్తామన్న నమ్మకం ఉందని అన్నారు. ప్రజలు ఓపిగ్గా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి సమాచారం తెప్పించుకుంటున్నారని ఆయన తెలిపారు. రాష్ట్రానికి ఏం చేయాలన్నది తమకు తెలుసని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించారని ఆయన చెప్పారు. తాను ఆయనతో సమావేశమైన సందర్భంగా రాష్ట్రానికి ఒక్కో హామీ నెరవేరుస్తున్నామని చెప్పారని సుజనా చౌదరి తెలిపారు. అయితే అందుకు కొంత సమయం పడుతుందని అన్నారని ఆయన తెలిపారు. టీడీపీకి విలువలు ఉన్నాయని చెప్పిన ఆయన, తమ పార్టీ మిత్రధర్మాన్ని కాపాడుతుందని చెప్పారు. రాజ్యసభలో ఏపీకి ప్రత్యేకహోదాపై జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అసలు కనిపించలేదని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో అరుణ్ జైట్లీ ఫోన్ లో మాట్లాడారని ఆయన తెలిపారు. జీఎస్టీ బిల్లుకి టీడీపీ పూర్తి మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు.