: 'ఇలాగైతే బుర్హాన్ లా పెన్నులకు బదులు గన్నులే పట్టుకుంటారు...' మనసును కదిలించేలా మోదీకి కాశ్మీరీ ఎన్నారై బాలిక లేఖ


కాశ్మీర్ ప్రాంతంలో ప్రజలు ఏమి కోరుకుంటున్నారో దానిని పాలకులు దగ్గర చేయలేకపోతున్నారని, అందువల్లనే ఈ ప్రాంతంలో హింస రోజురోజుకూ పెరుగుతోందని చెబుతూ 17 సంవత్సరాల ప్రవాస భారత బాలిక, ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి, మనసును కదిలించేలా ఓ లేఖ రాసింది. 'ప్రియమైన ప్రధానికి...' అంటూ సాగిన లేఖలో కాశ్మీరులో ప్రజలను సరిగ్గా చూసుకోవడం లేదని, ఇక్కడ ప్రజలకు అసలు స్వాతంత్ర్యమే లేదని అభిప్రాయపడింది. ప్రజాభిప్రాయాన్ని పట్టించుకోవడం లేదని అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఉంటూ, జూలై 10న తన బంధువులను కలుసుకునేందుకు కాశ్మీర్ వచ్చిన ఫాతిమా షహీన్ ఆరోపించింది. "నేను ఫ్రాన్స్ లోని నైస్ పై జరిగిన దాడికి సంబంధించిన వార్తను న్యూస్ ఫ్లాష్ చూశాను. ఆపై టర్కీలో సైన్యం జరిపిన దారుణాన్ని చూశాను. వీటితో పాటే దక్షిణ భారతదేశంలో రుతుపవనాలు సంతృప్తికరంగా ఉన్నాయని, విస్తారంగా వర్షాలు పడుతున్నాయన్న వార్త కూడా చదివాను. కానీ కాశ్మీర్ గురించిన వార్త లేదేం? నా స్వస్థలంలో ఏం జరుగుతోందన్న విషయం గురించిన సమాచారమే నాకు తెలియలేదు. ఇక్కడ ప్రసారమయ్యే ఏ చానల్ కూడా వాస్తవాన్ని చూపడం లేదు. ప్రతి ఒక్కరికీ ఈ భూమి కావాలే తప్ప, ఇక్కడి వారు అక్కర్లేదన్న సంగతి నాకు తెలుస్తోంది. ఇక్కడి ప్రజల బాగోగులను పట్టించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. అప్పుడే బుర్హాన్ వనీ గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుస్తోంది. అతను ఉగ్రవాదా? లేక వీరసైనికుడా? ఓ విద్యార్థి తన కెరీర్ లో పెన్నుకు బదులు గన్నును పట్టుకున్నాడంటే కాశ్మీర్ లో పరిస్థితులు ఎలా ఉన్నాయన్న విషయాన్ని కనీసం అర్థం చేసుకునేందుకు ప్రయత్నించండి. లేకుంటే మరింతమంది పెన్నులను వదిలి గన్నులు వెతుక్కుంటారు. ఇక్కడ మార్పు రావాలి" అని లేఖ రాసింది.

  • Loading...

More Telugu News