: నలుగురు దుండగులు... 90 సెకన్లు... రూ. 15 లక్షల దోపిడీ
పట్టపగలు బ్యాంకులోకి చొరబడి 90 సెకన్లలో రూ. 15 లక్షలను దోచుకెళ్లిన ఘటన పంజాబ్ లోని లూథియానాలో కలకలం రేపింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, ఇక్కడి కోచర్ మార్కెట్ పోలీసు స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి నలుగురు దొంగలు గాల్లోకి కాల్పులు జరుపుతూ ప్రవేశించారు. ఆ సమయంలో కనీసం సెక్యూరిటీ గార్డు కూడా లేడు. బ్యాంకులో ఆరుగురు ఉద్యోగులు ఉండగా, అంకుష్ చౌదరి అనే వ్యక్తి డబ్బు డిపాజిట్ చేసేందుకు వచ్చి ఉన్నాడు. ఇద్దరు దొంగలు లాబీలో కాపలాగా ఉండగా, మూడో వ్యక్తి మేనేజర్ ను బంధించాడు. నాలుగో వ్యక్తి క్యాషియర్ తలకు గురిపెట్టి, అంకుష్ డిపాజిట్ చేసిన రూ. 15 లక్షలు తీసుకు వెళ్లాడు. అదే సమయంలో బ్యాంకులోకి వస్తున్న మహిళ, విషయం తెలుసుకుని స్థానికులకు చెప్పగా, చుట్టుపక్కల వాళ్లు వచ్చేలోపే దొంగలు పారిపోయారు. ఈ దోపిడీ మొత్తం ఒకటిన్నర నిమిషంలో పూర్తికాగా, మొత్తం ఉదంతం సీసీ కెమెరాల్లో నమోదైంది. బ్యాంకుకు సెక్యూరిటీ గార్డును పెట్టుకోవాలని ఎన్నాళ్లుగానో చెబుతున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోలేదని తెలుస్తోంది. కేసు నమోదు చేసిన పోలీసులు దోపిడీ వెనుక ఉద్యోగుల పాత్రపైనా విచారిస్తున్నట్టు తెలిపారు.