: మారుతీ కార్ల ధరలు మళ్లీ పెరిగాయి!...8 నెలల్లో మూడు సార్లు పెంచేసిన కార్ మేకర్!
దేశంలో కార్ల తయారీలో దిగ్గజ కంపెనీగా ఎదిగిన మారుతీ సుజుకీ మరోమారు తన కార్ల ధరలను పెంచేసింది. తాను ఉత్పత్తి చేస్తున్న అన్ని మోడళ్ల ధరలను పెంచేసిన ఈ కంపెనీ... మోడళ్ల వారీగా ఒక్కో కారు ధరను రూ.1,500 నుంచి రూ.20 వేల మేర పెంచుతున్నట్లు నిన్న ప్రకటించింది. ఇప్పటికే ఈ ఏడాదిలో గడచిన ఆరు నెలల్లోనే రెండు సార్లు కార్ల ధరలను పెంచిన మారుతీ... తాజాగా మూడో దఫా కూడా ధరలను పెంచేసింది. ఆయా సెగ్మెంట్లలో డిమాండ్, ఫారెక్స్ కదలికల ఆధారంగానే ఈ దఫా ధరలను పెంచుతున్నట్లు కంపెనీ అధికార ప్రతినిధి చెప్పారు. తాజాగా పెరిగిన ధరల విషయానికొస్తే... మారుతీ సుజుకీ తాజా మోడల్ విటారా బ్రెజ్జా ధర రూ.20 వేల మేర పెరగగా, హ్యాచ్ బ్యాక్ మోడల్ బాలెనో రూ.10 వేల మేర పెరిగింది. ఇక ఇతర మోడళ్ల ధరలు కూడా రూ.1,500 నుంచి రూ.5 వేల మధ్య పెరిగాయి. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది.