: ‘హోదా’ కోసం పీఠాధిపతి అవతారం ఎత్తిన టీడీపీ ఎమ్మెల్యే!... బీజేపీ ఎమ్మెల్యేకు ఝలక్కిచ్చిన వైనం!


ఏపీకి ప్రత్యేక హోదా కోసం అధికారంలో ఉన్నప్పటికీ నిన్న టీడీపీ నేతలు నిరసనలతో హోరెత్తించారు. కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయినప్పటికీ ఆ పార్టీ ఎంపీలు నిన్న పార్లమెంటు లోపలా, బయటా నినాదాల హోరు వినిపించారు. ఇక తమ వంతు బాధ్యతగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ టీడీపీ నేతలు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఈ క్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత వాసుపల్లి గణేశ్ కుమార్ వినూత్న నిరసనకు దిగారు. ఖద్దరు వదిలి... కాషాయం వస్త్రాలు ధరించిన ఆయన ఏకంగా పీఠాధిపతి అవతారం ఎత్తారు. అంతటితో ఆయన ఆగలేదు. పీఠాధిపతి అవతారంలోనే బీజేపీ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు నివాసానికి గణేశ్ కుమార్ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యే విచిత్ర వేషధారణలో తన ఇంటికి రావడంతో తొలుత షాక్ తిన్న విష్ణు... ఆ తర్వాత ఆయనను సాదరంగా తన ఇంటిలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా గణేశ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ మధ్యకాలంలో ప్రధాని నరేంద్ర మోదీ పీఠాధిపతులకు ఇస్తున్న గౌరవం ప్రజాప్రతినిధులకు ఇవ్వడం లేదని ఆరోపించారు. అందుకోసమే పీఠాధిపతి వేషంలో బీజేపీ ఎమ్మెల్యేను కలిశానని చెప్పారు.

  • Loading...

More Telugu News