: ఢిల్లీలో ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుని ప్రజల కష్టాలను స్వయంగా చూసిన హర్యానా సీఎం
భారీ వర్షాలకు, ఆపై ముంచెత్తిన వరద నీటి కారణంగా ఢిల్లీ, గుర్గావ్ ల మీదుగా జైపూర్ కు వెళ్లే జాతీయ రహదారిపై రాజోకరి వద్ద కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ ఏర్పడగా, హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ చిక్కుకుపోయి ప్రజలు పడుతున్న కష్టాలను స్వయంగా అనుభవించారు. న్యూఢిల్లీలోని హర్యానా భవన్ కు బయలుదేరిన ఆయన గమ్యాన్ని చేరే మార్గం కనిపించక, తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగి వెళ్లాల్సి వచ్చింది. వెనుదిరిగి వెళ్లేందుకు కూడా ఆయన మూడు గంటలకు పైగా నిరీక్షించినట్టు సమాచారం. కాగా, న్యూఢిల్లీలోకి ప్రవేశించే రోడ్డు మార్గాల్లో రాజోకరి జంక్షన్ కీలకం కాగా, ఈ ప్రాంతంలో గంటల కొద్దీ వాహనాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఈ పరిస్థితి ఏర్పడటానికి కారణం మీరంటే మీరని ఢిల్లీ, హర్యానా ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విమర్శలు సంధించుకుంటున్నాయి.