: అమెరికా ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంది.. అనుమానం వ్యక్తం చేసిన ట్రంప్


అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్‌కు ఓటమి భయం పట్టుకుందా..? ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నవంబరులో జరగనున్న ఎన్నికల్లో తనను ఓడించేందుకు రిగ్గింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ తాజాగా కొత్త పల్లవి అందుకున్నారు. ఓహియోలోని కొలంబస్‌లో జరిగిన ఓ సమావేశంలో మాట్లాడిన ట్రంప్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతుందేమోనని నాకు భయం వేస్తోంది’’ అని పేర్కొన్నారు. రిగ్గింగ్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. ఈ ఎన్నికలు స్వేచ్ఛగా జరిగే అవకాశం తనకు కనిపించడం లేదన్న ట్రంప్ ఈ విషయంపై అంతకు మించి మాట్లాడేందుకు నిరాకరించారు. వివాదాస్పద వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలిచే ట్రంప్ ప్రభ మొదట్లో వెలిగిపోయినట్టు కనిపించింది. అతని ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ఈ పోరులో కాస్త వెనకబడినట్టు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సమీకరణాలు మారి హిల్లరీ వైపే ప్రజల మొగ్గు ఉన్నట్టు తేలడంతోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని హిల్లరీ మద్దతుదారులు అంటున్నారు. మరోవైపు ట్రంప్‌కు వ్యతిరేకంగా రోజుకొకరు ప్రచారం ప్రారంభించడాన్ని కూడా జీర్ణించుకోలేకపోతున్న ఆయన ఓటమి భయంతోనే ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News