: ‘ఈజ్’లో ‘టాప్’ ఎవరిదో?... ఈ నెల 16 దాకా తెలుగు రాష్ట్రాలకు ఉత్కంఠ తప్పదు!
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల విషయంలో తెలుగు రాష్ట్రాల మధ్య బిగ్ ఫైట్ నెలకొన్న సంగతి తెలిసిందే. కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ జారీ చేసే ఈ ర్యాంకుల్లో ప్రస్తుతానికి మొదటి రెండు ర్యాంకులు తెలుగు నేలవే. నిన్నటి(సోమవారం)దాకా ఉన్న ర్యాంకుల ప్రకారం 60.24 పాయింట్లతో కొత్త రాష్ట్రం తెలంగాణ అగ్ర భాగాన కొనసాగుతుండగా, 55.75 పాయింట్లతో రెండో స్థానంలో ఏపీ ఉంది. అయితే ఈ ఏడాది ఫస్ట్ ర్యాంకు కోసం ఇరు రాష్ట్రాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పరిశ్రమల స్థాపన, కార్పొరేట్లను ఆకర్షించడం, అనుమతుల జారీ తదితర అంశాలకు సంబంధించి వాతావరణం ఆధారంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ ర్యాంకులిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ర్యాంకుల కోసం కోసం ఆయా రాష్ట్రాలు... తాము పారిశ్రామిక సంస్థలకు ఇస్తున్న ప్రోత్సాహకాలు, కల్పిస్తున్న వాతావరణం తదితరాలకు సంబంధించిన వివరాలను వెల్లడించాల్సి ఉంది. ఈ క్రమంలో తొలుత తెలంగాణ, ఆ తర్వాత ఏపీ తమ తమ వివరాలను కేంద్రానికి పంపాయి. అయితే ఏపీ సర్కారు తాము పంపిన వివరాలను కాపీ కొట్టిందంటూ తెలంగాణ ప్రభుత్వం సంచలన ఆరోపణ చేసింది. అయితే తాము వేరెవరి అంశాలనో కాపీ కొట్టాల్సిన అవసరం లేదని ఏపీ కూడా ఘాటుగానే బదులిచ్చింది. ఇదిలా ఉంటే... ఈ ఏడాది జూన్ 30 దాకా ఉన్న స్థితిగతుల ఆధారంగానే ఈ ఏడాది ర్యాంకులను విడుదల చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఈ ప్రకారం నిన్ననే ఈ ర్యాంకులు విడుదల కావాల్సి ఉంది. అయితే అనుకోని కారణాల వల్ల ఈ ర్యాంకుల ప్రకటనను కేంద్రం ఈ నెల 16కు వాయిదా వేసింది. వెరసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకుల విడుదల మరో 15 రోజుల పాటు వాయిదా పడింది. అప్పటిదాకా ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల్లో ఉత్కంఠ తప్పదు.