: పార్లమెంటు సాక్షిగా హామీ ఇస్తున్నా.. ఒక్క కార్మికుడు కూడా ఆకలితో అలమటించే పరిస్థితి రానివ్వను: సుష్మా


సౌదీ అరేబియాలో చిక్కుకుపోయిన పదివేల మంది భారతీయులను వెనక్కి రప్పిస్తామని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ పునరుద్ఘాటించారు. వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ ఇండియాకు తీసుకొస్తామని పార్లమెంటు ఉభయ సభల్లో పేర్కొన్నారు. కార్మికులను వెనక్కి రప్పించే ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు సహాయ మంత్రి వీకే సింగ్ నేడు(మంగళవారం) సౌదీ వెళ్లనున్నట్టు తెలిపారు. దేశం కాని దేశంలో కష్టాలు అనుభవిస్తున్న భారతీయుల్లో ఏ ఒక్కరు కూడా ఆకలితో అలమంటించకూడదన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు. వారికి ఆహారం అందించేందుకు అక్కడి భారత రాయబార కార్యాలయం ఐదు క్యాంపులు నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ‘‘మనవాళ్లు ఒక్కరు కూడా ఆకలితో బాధపడే పరిస్థితి రానివ్వబోనని పార్లమెంటు సాక్షిగా దేశానికి హామీ ఇస్తున్నా. వారందరినీ వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొస్తాం’’ అని సుష్మ పేర్కొన్నారు. ఈ విషయంలో సౌదీ అరేబియా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్లు లేకుండా కార్మికులకు ఎగ్జిట్ వీసాలు మంజూరు చేసేందుకు అక్కడి చట్టాలు అనుమతించకపోవడంతో కొంత ఆలస్యం జరుగుతున్నట్టు తెలిపారు. కొన్ని నెలలుగా పెండింగులో ఉన్న కార్మికుల వేతనాలను చెల్లించేలా చర్యలు తీసుకోవడంతోపాటు ఎగ్జిట్ వీసాలు మంజూరు చేయాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరినట్టు సుష్మ వివరించారు.

  • Loading...

More Telugu News