: ప్రధాన కార్యదర్శి టక్కర్ సేవలు మరో ఆరు నెలలు కావాలట!... కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు!
సీనియర్ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సత్యప్రకాశ్ టక్కర్ సేవలు మరో ఆరు నెలల పాటు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలట. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతికి ప్రభుత్వ విభాగాల తరలింపు, విజన్ 2029 రూపకల్పన తదితర కీలక అంశాలు పూర్తి కానందున, వాటిని పర్యవేక్షిస్తున్న ఎస్పీ టక్కర్ సేవలను మరో ఆరు నెలల పాటు తాము వినియోగించుకునేలా అనుమతించాలని ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న కేంద్ర ప్రభుత్వానికి ఓ లేఖ రాశారు. ఇటీవలే ఏపీ సీఎస్ గా పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్పీ టక్కర్ సర్వీసు ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ఆయన సర్వీసును మరో ఆరు నెలల పాటు పొడిగించాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. డీఓపీటీ నిబంధనల ప్రకారం ఒక అధికారికి 3 నెలలు మాత్రమే సర్వీసు పొడిగించే వీలుంది. ఆ మూడు నెలలు కూడా పూర్తి అయితే.. మరో మూడు నెలల పొడిగింపు కోసం ఫైలు ప్రధాని వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు లేఖకు స్పందించి కేంద్రం ఎస్పీ టక్కర్ సేవలను 3 నెలల పాటు పొడిగించినా, మరో మూడు నెలల పొడిగింపు కోసం చంద్రబాబు మరో లేఖ రాసేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. వెరసి ఎస్పీ టక్కర్ సేవలను ఆయన పదవీ విరమణ తర్వాత కూడా ఆరు నెలల పాటు వినియోగించుకునేందుకు చంద్రబాబు దాదాపుగా నిర్ణయం తీసుకున్నారట.