: ఏపీ అంతటా బంద్!... తెల్లవారుజామునే రోడ్డెక్కిన వైసీపీ, వామపక్షాలు!
ఏపీకి ప్రత్యేక హోదా దక్కని వైనంపై ఆ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం వైసీపీతో పాటు వామపక్షాలు నేడు రాష్ట్రవ్యాప్త బంద్ కు పిలుపునిచ్చాయి. ఈ క్రమంలో నేడు తెల్లవారకముందే రాష్ట్రంలోని అన్ని ప్రధాన ప్రాంతాల్లో రోడ్లపైకి వచ్చి ఆ పార్టీల నేతలు ఎక్కడికక్కడ ఆర్టీసీ బస్సులను అడ్డుకుంటున్నారు. ఫలితంగా పలు ప్రాంతాల్లో ప్రజా రవాణా నిలిచిపోయింది. అదే సమయంలో రంగంలోకి దిగిన పోలీసులు కూడా ఎక్కడికక్కడ ఆందోళనకారులను అదుపులోకి తీసుకునేందుకు యత్నిస్తున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో తెల్లవారకముందే ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఇదిలా ఉంటే, తిరుమల వెళ్లే భక్తులకు ఎలాంటి ఆటంకం కలిగించరాదన్న భావనతో తిరుపతి నుంచి తిరుమల బయలుదేరే బస్సులను మాత్రం ఆందోళనకారులు అడ్డుకోలేదు. దీంతో తిరుపతి నుంచి తిరుమల వెళ్లే బస్సులు యథాతథంగా తిరుగుతున్నాయి.