: కేటీఆర్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
కరీంనగర్ జిల్లాలో మంత్రి కేటీఆర్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కరీంగనర్ లో పర్యటించిన అనంతరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో కేటీఆర్ అధ్యక్షతన రాష్ట్రస్థాయి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్లు, కమీషనర్ ల సమావేశం జరిగింది. అనంతరం హైదరాబాదు వెళ్తున్న కేటీఆర్ కాన్వాయన్ ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఎంసెట్-2 ను రద్దు చేసి విద్యార్థులకు అన్యాయం చేయవద్దని నినాదాలు చేశారు. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు వారిని చెదరగొట్టి కొందరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏబీవీపీ నేతలు మాట్లాడుతూ, కార్పొరేట్ కళాశాలల దుశ్చర్యల వల్లే ప్రశ్నాపత్రాలు లీక్ అవుతున్నాయని ఆరోపించారు. అధికారంలోకి రాకముందు, ఉద్యమం సమయంలో టీఆర్ఎస్ పార్టీ విద్యారంగంలో ప్రైవేటు వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలిస్తామని ప్రగల్భాలు పలికిందని, ఇప్పుడు వాటికి ఎందుకు వత్తాసు పలుకుతోందో సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.