: హైదరాబాదులోని సుజనా షాపింగ్ మాల్ లో సందడి చేసిన హృతిక్ రోషన్
హైదరాబాదులో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ సందడి చేశాడు. రాడో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న హృతిక్ రోషన్ ఈ బ్రాండ్ కు సంబంధించిన వాచ్ ను ఆవిష్కరించేందుకు హైదరాబాదు, కూకట్ పల్లిలోని సుజనా షాపింగ్ మాల్ కు వచ్చాడు. హృతిక్ వస్తున్నాడన్న వార్త తెలియడంతో సుజనా షాపింగ్ మాల్ కు అభిమానులు పోటెత్తారు. రాడో వాచ్ ను ఆవిష్కరించిన సందర్భంగా హృతిక్ మాట్లాడుతూ, అభిమానుల ఆదరణే తమను నడిపిస్తుందని అన్నాడు. అభిమానులు చూపించే ప్రేమాభిమానాలు ఎంత రిస్క్ చేసేందుకైనా వెనుకాడనీయకుండా చేస్తున్నాయని చెప్పాడు. చారిత్రక ప్రదేశాలు చూడడమంటే తనకు చాలా ఇష్టమని చెప్పిన హృతిక్, హైదరాబాదు తనకు బాగా ఇష్టమని చెప్పాడు. రాడో వాచ్ లు వినియోగదారులను ఆకట్టుకునేలా తయారు చేశారని, వాటిని ధరించి మరింత అందంగా కనిపించాలని సూచించాడు. అభిమానుల కోసం ఏం చేసేందుకైనా సిద్ధమని హృతిక్ తెలిపాడు. ఈ సందర్భంగా పలువురు అభిమానుల కోరిక మేరకు వారితో కలిసి డ్యాన్స్ చేశాడు. పలువురితో సెల్ఫీలు దిగి వారిని అలరించాడు.