: పుష్కరాలతో పుణ్యం సంగతి దేవుడెరుగు... రోగాలు పట్టుకుంటాయి: డాక్టర్ సమరం
పుష్కరాల నిర్వహణ వల్ల పుణ్యం రావడం సంగతి దేవుడెరుగు, రోగాలు మాత్రం పట్టుకుంటాయని డాక్టర్ సమరం తెలిపారు. గోదావరి పుష్కరాల సందర్భంగా వందలాది మంది రోగులకు వైద్యసేవలందించానని అన్నారు. తానే కాదు, రాజమండ్రిలో చర్మసంబంధ వ్యాధుల వైద్యులను విచారిస్తే... అంటురోగాలు ప్రబలడం వాస్తవమా? కాదా? అన్న సంగతి తెలుస్తుందని ఆయన సవాలు విసిరారు. గోదావరి పుష్కరాల్లో పాలు పంచుకున్న వారి పాపాలు తొలగిపోయినప్పుడు, మళ్లీ కృష్ణా పుష్కరాలు నిర్వహించాల్సిన అవసరం ఏముందని ఆయన నిలదీశారు. ఏడాదిపాటు పుష్కరుడు నదిలోనే నిల్వ ఉన్నప్పుడు పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వాలు ఇంత ఉబలాటపడడంలో ఉద్దేశ్యం ఏంటని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాలు వారం, పది రోజులే ఎందుకు హారతి నిర్వహణా కార్యక్రమాలు నిర్వహిస్తాయి? ఏడాది పొడుగునా ఎందుకు నిర్వహించరు? అని ఆయన నిలదీశారు. సహేతుకంగా ఆలోచిస్తే... పుష్కరాలన్నీ పంచాగ కర్తల క్రియేషన్ అని, వాటి వల్ల జరిగే ఉపయోగాలు ఏమీ లేవని ఆయన చెప్పారు. ఇకపోతే పంచాంగకర్తలు చెబుతున్నట్టు పుష్కరాల సమయంలో నదినీటిలో ఔషధ గుణాలు ఉంటాయనడానికి ఆధారాలు లేవని, నది ఏడాది పొడుగునా ప్రవహిస్తున్నప్పుడు కేవలం పుష్కరాల కాలంలోనే ఔషధ గుణాలు కనిపించి, ఆ తరువాత మాయవడం అనేది ఉండదని ఆయన స్పష్టం చేశారు.