: ప్రభుత్వం పుష్కరాలను నిర్వహించడం అంటే రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమే: డాక్టర్ సమరం
పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించడం రాజ్యాంగ ఉల్లంఘనేనని డాక్టర్ సమరం తెలిపారు. విజయవాడలో ఆయన చెబుతూ, మన దేశం సెక్యులర్ దేశమని, సర్వమతాలకు నెలవైన భారత రాజ్యాంగం ప్రకారం ఒక మతాన్ని, ఒక మత సంప్రదాయాన్ని ప్రోత్సహించడం నేరమని అన్నారు. ఒకర్ని చూసి ఒకరు నదుల్లో స్నానం చేయడానికి వెళ్తుంటారు తప్ప, భక్తితో వెళ్లేవాళ్లు తక్కువ మంది ఉంటారని ఆయన చెప్పారు. గందరగోళం మధ్య భక్తి ఎలా ఉంటుందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక నదిలో ఎన్నో ఉపనదులు, పిల్లకాలువలు, ఇంకెన్నో వాగులు వంకలు కలుస్తాయని, వాటన్నింటికీ ఎందుకీ పవిత్రత ఉండదని ఆయన తెలిపారు. మతం పేరుతో మూఢనమ్మకాలను మతాచార్యులు ప్రచారం చేస్తే... ఆ ప్రచారాలను జనాలు నమ్ముతుంటే... వాటిని ఓట్లుగా మలచుకునేందుకు రాజకీయ నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు. రాజుల కాలంలో కూడా పుష్కరాలను నిర్వహించడమనే సంప్రదాయాలు లేవని, ప్రజాస్వామ్య భారత దేశంలో మాత్రం ప్రభుత్వాలే పుష్కరాలను నిర్వహిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ సంప్రదాయాలు పాటించడం ప్రభుత్వానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు.