: విరాట్ కోహ్లిని కట్టడి చేశాం.. బౌలర్లలో ఆత్మవిశ్వాసం పెరిగింది: వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్
వెస్టిండీస్‌లోని కింగ్‌స్టన్ వేదికగా టీమిండియా, విండీస్ టీమ్ మధ్య కొనసాగుతోన్న రెండో టెస్టు మ్యాచ్ ద్వారా తమ జట్టు బౌలింగ్ మెరుగుపడిందని చెప్పవచ్చని వెస్టిండీస్ కోచ్ ఫిల్ సిమన్స్ అన్నాడు. మొదటి ఇన్సింగ్స్‌లో విరాట్ కోహ్లీ(44 పరుగులు)ని తాము తక్కువ పరుగులకే కట్టడి చేయడమే దానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. తాము టీమిండియా బ్యాట్స్‌మెన్‌ని కట్టడి చేయడానికి వ్యూహాలు సిద్ధం చేసుకొని బరిలోకి దిగామని ఆయన తెలిపారు. తమ బౌలర్లు తక్కువ స్కోరుకే కోహ్లి వికెట్‌ను పడగొట్టడం అన్నది టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే అంశమేనని సిమన్స్ అన్నారు. మిగతా టీమిండియా బ్యాట్స్‌మెన్లను వీలయినంత తొందరగా ఔట్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నామని ఆయన పేర్కొన్నారు. తమ బౌలర్లు తాము చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుంటూ రాణిస్తున్నారని సిమన్స్ పేర్కొన్నారు. మొదటి ఇన్సింగ్‌లో వెస్టిండీస్ 196 పరుగులకే ఆలౌటైతే, టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 358 పరుగులు చేసిన విషయం తెలిసిందే. 162 పరుగుల లీడ్ ఉన్న టీమిండియా బ్యాటింగ్‌ను ఈరోజు కొనసాగించనుంది.