: సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయిన వేళ... మెరిసిన చిన్న, మధ్యతరహా కంపెనీలు
సెషన్ ఆరంభంలోని లాభాలు, ఆపై విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల అమ్మకాల కారణంగా మార్కెట్లు నష్టాల్లోకి జారగా; చిన్న, మధ్యతరహా కంపెనీల ఈక్విటీల్లో మాత్రం నూతన కొనుగోళ్లు కనిపించి, భవిష్యత్ గమనంపై ఆసక్తిని పెంచాయి. యూరప్ మార్కెట్ల సరళి మధ్యాహ్నం తరువాత కొంత కొనుగోలుకు కారణమైనప్పటికీ, నష్టాల నుంచి గట్టెక్కేందుకు మాత్రం సహకరించలేదు. సెన్సెక్స్, నిఫ్టీలు నష్టపోయిన వేళ, మిడ్, స్మాల్ క్యాప్ లాభాలతో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ సైతం స్వల్పంగా పెరిగింది. సోమవారం నాటి మార్కెట్ సెషన్ ముగిసేసరికి, బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సెన్సెక్స్ సూచిక 48.74 పాయింట్లు పడిపోయి 0.17 శాతం నష్టంతో 28,003.12 పాయింట్ల వద్ద, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచిక నిఫ్టీ 1.95 పాయింట్లు తగ్గి 0.02 శాతం నష్టంతో 8,636.55 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈ మిడ్ కాప్ 0.38 శాతం, స్మాల్ కాప్ 0.10 శాతం లాభపడ్డాయి. ఇక ఎన్ఎస్ఈ-50లో 29 కంపెనీలు లాభపడ్డాయి. హెచ్సీఎల్ టెక్, టీసీఎస్, టాటా స్టీల్, హిందాల్కో, గ్రాసిమ్ తదితర కంపెనీలు లాభాల్లో పయనించగా, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బీహెచ్ఈఎల్, బ్యాంక్ ఆఫ్ బరోడా, అదానీ పోర్ట్స్ తదితర కంపెనీలు నష్టాల్లో నడిచాయి. బీఎస్ఈలో మొత్తం 2,894 కంపెనీల ఈక్విటీలు ట్రేడింగ్ లో పాల్గొనగా 1,178 కంపెనీలు లాభాలను, 1,563 కంపెనీలు నష్టాలను నమోదు చేశాయి. గత వారాంతాన రూ. 1,08,63,581 కోట్లుగా నమోదైన బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ కాప్ నేడు రూ. 1,08,83,421 కోట్లకు పెరిగింది.