: సోషల్ మీడియాలో మోదీపై విరుచుకుపడండి: సినీ నటుడు శివాజీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా పదేళ్లు ఇస్తానని తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ దానిని తుంగలో తొక్కారని సినీ నటుడు శివాజీ ఆరోపించారు. అమెరికాలోని న్యూజెర్సీలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అహర్నిశలు కష్టపడుతున్నారని అన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కాళ్లకు చక్రాలు కట్టుకుని తిరుగుతున్నారని, అలాంటి వ్యక్తికి కేంద్రం సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఏపీకి పూర్తి అన్యాయం చేయ్యాలని భావిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన విద్యావంతులంతా సోషల్ మీడియా మాధ్యమంగా మోదీపై యుద్ధం ప్రకటించాలని ఆయన సూచించారు. ఫేస్ బుక్, ట్విట్టర్ ఇలా ఏదయినా సరే మోదీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి...ఆయన వినియోగించుకునే సోషల్ మీడియాను సమర్థవంతంగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఏపీకి చెందిన వారంతా సోషల్ మీడియా ద్వారా మోదీని విమర్శిస్తూ పోస్టులు పెడితే, ప్రజాకాంక్ష ఎంత తీవ్రంగా ఉందో ఆయనకు తెలుస్తుందని ఆయన చెప్పారు. మనకు మోదీని తిట్టాలని లేనప్పటికీ ఆయనే తిట్టించుకుంటున్నారని ఆయన తెలిపారు.