: తెలుగుదేశంతో దూరం పెరుగుతోంది... మంచిది కాదు: మోదీకి స్వయంగా ఫోన్ చేసిన వెంకయ్య
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా రేపుతున్న మంటలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రధానికి స్వయంగా ఫోన్ చేశారు. రాజ్యసభలో చర్చ జరిగిన తరువాత జరిగిన పరిణామాలను పూసగుచ్చినట్టు మోదీకి తెలిపిన ఆయన, తెలుగుదేశం బీజేపీల మధ్య దూరం పెరుగుతోందని, ఇది ఇరు పార్టీలకూ మంచి పరిణామం కాదని వెంకయ్య తెలిపినట్టు సమాచారం. ఎన్నికలకు ముందు బీజేపీ స్వయంగా ప్రత్యేక హోదా హామీ ఇచ్చిందని గుర్తు చేసిన ఆయన, అవకాశం ఉన్నంత మేరకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తద్వారా సమస్యలను పరిష్కరించవచ్చని వెంకయ్య సూచించినట్టు తెలుస్తోంది. వీరిద్దరి మధ్యా ఫోన్ సంభాషణపై మరింత సమాచారం వెలువడాల్సి వుంది.