: తోటి పోటీదారు సెల్ఫీ దిగుదామంటే, తిరస్కరించిన మైఖేల్ ఫెల్ప్స్... నొచ్చుకున్న రామిస్ అనీస్
మైఖేల్ ఫెల్ప్స్... అమెరికన్ స్విమ్మర్. అత్యధిక వ్యక్తిగత ఒలింపిక్స్ పతకాల రికార్డు సాధించిన దిగ్గజ ఆటగాడు. ఎందరో స్విమ్మర్స్ దృష్టిలో హీరో. మరెంతో మంది ఫెల్ప్స్ ను ఆదర్శంగా తీసుకుని ఈ క్రీడలో రాణించాలని కలలు కంటున్నారు. అటువంటి కలలను నిజం చేసుకుని సిరియా రెఫ్యూజీ టీమ్ తరఫున ఒలింపిక్స్ పోటీల్లో పాల్గొనేందుకు వచ్చిన స్విమ్మర్ రామిస్ అనీస్ తీవ్ర నిరాశకు గురయ్యాడు. తన అభిమాన స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ వద్దకు వెళ్లి ఓ సెల్ఫీ దిగుదామని కోరగా, అందుకు ఫెల్ప్స్ తిరస్కరించాడట. ఈ విషయాన్ని రామీ కోచ్, మాజీ ఒలింపిక్ స్విమ్మర్ కెరీన్ వెర్బావెన్ వెల్లడించారు. తమ ఆటగాడికి పతకం రాకున్నా ఫెల్ప్స్ ను కలుసుకున్న తృప్తే అత్యంత ఆనందమని, అటువంటిది అతని కోరికను ఫెల్ప్స్ ఎందుకు తీర్చలేదో తెలియలేదని అన్నాడు. కాగా, తన 14 సంవత్సరాల నుంచే స్విమ్మింగ్ లో రాణిస్తూ, రెండు వరల్డ్ చాంపియన్ షిప్ లలో సిరియా తరఫున పాల్గొన్న రామిస్ అనీస్, ఈ దఫా సిరియా రెఫ్యూజీ టీం నుంచి రియోకు వచ్చాడు. ఫెల్ప్స్ తిరస్కరణకు గురైన తరువాత అనీస్ ఎంతో బాధపడ్డాడని, ఏదో ఒకరోజున ఫెల్ప్స్ పక్కన నిలబడి, అతనితో కలసి ఫోటో దిగే సందర్భం తప్పక వస్తుందని చెప్పి సముదాయించామని కెరీన్ వ్యాఖ్యానించారు. కాగా, 100 మీటర్ల బటర్ ఫ్లయ్ విభాగంలో అనీస్ పోటీపడుతున్నాడు.