: ఏఎన్-32లో 'అండర్ వాటర్ లొకేటర్' లేనే లేదు... ఇక కనుగొనడం అసాధ్యమే!
గత నెల 22వ తేదీన చెన్నైలోని తాంబరం విమానాశ్రయం నుంచి పోర్ట్ బ్లెయిర్ కు 29 మందితో బయలుదేరి మార్గమధ్యంలో అదృశ్యమైన భారత వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం ఏమైందో తెలుసుకునే అవకాశాలే లేవని నిపుణులు భావిస్తున్నారు. ఈ విమానంలో 'అండర్ వాటర్ లొకేటర్' అమర్చనే లేదన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. నీటిలో విమానం కూలిపోతే కనుక, వెంటనే వాటర్ రెసిస్టెన్స్ ఉండే ఈ పరికరం నిరంతరాయంగా సిగ్నల్స్ పంపుతూ విమానం ఉన్న ప్రాంతం గురించిన సమాచారాన్ని బాహ్య ప్రపంచానికి అందిస్తుంది. గత పది రోజులుగా 10కి పైగా యుద్ధ విమానాలు, ఓ సబ్ మెరైన్, ఆరు యుద్ధ నౌకలు ఈ సిగ్నల్స్ కోసం వెతికి వెతికి అలసిపోయాయి. బంగాళాఖాతాన్ని ఉపరితలంపైనుంచి జల్లెడ పట్టినా ఈ సిగ్నల్ లభించలేదు. ఇండియాలోని కొన్ని వాయుసేన విమానాల్లో యూఎస్ లో తయారైన ఆర్టెక్స్ సీ-406-1, ఫ్రాన్స్ లో తయారైన కన్నాడ్ 406ఏఎస్ రకం 'అండర్ వాటర్ లొకేటర్'లను వినియోగిస్తున్నారు. ఇవి సెకనుకు 4.5 అడుగుల వేగంతో నీరు లేదా భూ ఉపరితలాన్ని తాకితే పనిచేయడం ప్రారంభిస్తాయి. ఈ సిగ్నల్స్ వెల్లడికావడం ప్రారంభమైతే, వాటిని శాటిలైట్లు, తేలికపాటి రాడార్లు సైతం కనిపెట్టగలవు. ఒకసారి సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలిస్తే ఎక్కడ విమానం ఉందన్నది వెంటనే తెలుస్తుంది. అయితే ఆర్టెక్స్, కన్నాడ్ 'అండర్ వాటర్ లొకేటర్'లలో ప్రమాదం జరిగిన 70 గంటల వరకూ మాత్రమే బ్యాటరీలు పనిచేస్తాయి. ఆపై అవి డెడ్ అయితే, ఎలాంటి సిగ్నల్స్ వెలువడవు. ప్రమాదం జరిగి 10 రోజులు గడుస్తుండగా, ఇక ఈ విమానాన్ని ఎప్పటికీ కనుక్కోలేక పోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.