: ప్రధానితో సమావేశం తర్వాత ‘హోదా’పై దేనికైనా సిద్ధం: మంత్రి కొల్లు రవీంద్ర
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలు నిరసన తెలుపుతోన్న నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర స్పందించారు. విజయవాడలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో తాము సమావేశం నిర్వహించాక ఓ నిర్ణయం తీసుకొని దేనికైనా సిద్ధపడతామని తేల్చి చెప్పారు. హోదా కోసం ఆందోళన చేస్తోన్న వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో కాకుండా ఢిల్లీలో తన నిరసన తెలపాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రజలకు నమ్మకం ఉందని, అందుకే ఆయనను ఎన్నికల్లో గెలిపించారని అన్నారు. జగన్ ప్రతిపక్షనేతగా బాధ్యతాయుతంగా మాట్లాడాల్సి ఉంటుందని, లేదంటే ప్రజలే ఆయనకు బుద్ధి చెబుతారని ఆయన వ్యాఖ్యానించారు.