: ‘హోదా’ సాధిస్తే వెంకయ్య, సుజనా, అశోక్ గజపతి ఇళ్ల ముందు ఊడ్చడానికి సిద్ధం: రఘువీరా
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై ఈ నెల 5న రాజ్యసభలో ఓటింగ్ జరిగేలా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధ్యత తీసుకోవాలని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు విద్రోహ సదస్సు కొనసాగుతోంది. ఈ సందర్భంగా వేదికపై రఘువీరారెడ్డి మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధిస్తే కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి, అశోక్ గజపతి రాజు ఇళ్ల ముందు తాము చెత్తను ఊడ్చడానికి సిద్ధమని వ్యాఖ్యానించారు. హోదాపై ఓటింగ్ జరగకపోతే టీడీపీ, బీజేపీ నేతలను ప్రజలు తరిమికొడతారని రఘువీరా అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం చంద్రబాబు ఢిల్లీకి వెళ్లి హోదా కోసం పోరాడాలని డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు హోదాపై ప్రజలను మభ్యపెడుతున్నారని, వారిని వెర్రివాళ్లని చేయాలనుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ‘ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లరు... ఎంపీలు మాత్రమే అక్కడికి వెళ్లి అడుగుతారట’ అని ఆయన ఎద్దేవా చేశారు. ఇక మీరున్నదెందుకు? అని చంద్రబాబుని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి ఢిల్లీకి ఎందుకు వెళ్లడం లేదని రఘువీరా దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టవా? అని ఆయన ప్రశ్నించారు. రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ వాకౌట్ చేస్తే టీడీపీ ఎంపీలు హోదాపై ఏమీ అడగలేకపోయారని రఘువీరా విమర్శించారు. హోదాపై చంద్రబాబు పోరాడాలని ఆయన అన్నారు. హోదాపై కాంగ్రెస్ పార్టీని టీడీపీ నేతలు నిందించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.