: తెలుగుదేశం ఎంపీలకు... మోదీ అపాయింట్ మెంట్ లభించేనా?
తెలుగుదేశం ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా? ఇవ్వరా? తెలుగు రాష్ట్రాల్లో నేడు జరుగుతున్న చర్చ ఇదే. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదని, రాజ్యసభలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ చెప్పకనే చెప్పిన వేళ, పరిస్థితులు శరవేగంగా మారుతూ ఉంటే, ఏపీలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీతో మిత్రబంధాన్ని తెంచుకోవాలని తెలుగుదేశం పార్టీ అధినేతపై ఒత్తిడి పెరుగుతున్న వేళ, అటు ఆ పని చేయలేక, ఇటు రాష్ట్ర ప్రజలకు సెంటిమెంటుగా మారిన ప్రత్యేక హోదాను సాధించుకుని తేలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్నటి తన మీడియా సమావేశంలో ఒకింత ఆవేదనను కూడా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధాని మోదీని కలిసి, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలపై వివరించేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ, తెలుగుదేశం పార్టీ అపాయింట్ మెంట్ కోరింది. ఈ మేరకు సాధ్యమైనంత త్వరగా ప్రధానితో కలిపించాలని ఆయన కార్యదర్శికి దరఖాస్తు చేసింది. ఆయన అపాయింట్ మెంట్ లభిస్తే, హోదా, విభజన హామీలను గురించి విన్నవించాలని, ఇవ్వకుంటే పార్లమెంటులో నిరసనలు తెలపాలని చంద్రబాబు, తన ఎంపీలకు ఇప్పటికే సూచించినట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే నేడు లోక్ సభ, రాజ్యసభల్లో తెలుగుదేశం పార్టీతో పాటు వైకాపా, కాంగ్రెస్ పార్టీ సభ్యులు సైతం సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. లోక్ సభను వాయిదా వేయించారు. మామూలుగా అయితే, ఎంపీలు కోరగానే ప్రధాని అపాయింట్ మెంట్ వెంటనే లభిస్తుంది. కానీ, వీరి దరఖాస్తుపై ఇంతవరకూ ఎటువంటి నిర్ణయమూ వెలువడలేదు. ఎంపీలను కలిసే ఉద్దేశం ప్రధాని మోదీకి లేనట్టుగా ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఒకవేళ కలిసినా ప్రత్యేక హోదాపై స్పష్టమైన హామీని ఆయన ఇవ్వబోరని తెలుస్తోంది. మరోవైపు జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మలచుకోవాలని అటు కాంగ్రెస్, ఇటు వైకాపా పార్టీలు భావిస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు వైఖరి కారణంగానే రాష్ట్రానికి హోదా రావడం లేదని విమర్శలను ఇరు పార్టీల నేతలూ సంధించారు. ఎన్నో కేసులకు భయపడిన ఆయన, కేంద్రంతో రాజీపడ్డారని, అందువల్లే హోదాపై ఒత్తిడి తేవడం లేదని విపక్ష నేతలు ఆరోపించారు. ప్రజల్లో సైతం అదే విధమైన అభిప్రాయం పెరుగుతున్న వేళ, మిత్రధర్మానికి కట్టుబడి కేంద్రంపై ఒత్తిడిని ఎలా పెంచాలన్న ఆలోచనలో చంద్రబాబు తలమునకలై ఉన్నారు. ఇక ఎంపీలు కోరినట్టుగా ప్రధాని అపాయింట్ మెంట్ ఎప్పుడు లభిస్తుందన్న విషయమై ఇంకా స్పష్టత రాలేదు.