: ‘హోదా’ నినాదాల ఎఫెక్ట్!... మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడ్డ లోక్ సభ!
ఏపీకి ప్రత్యేక హోదా నినాదాలతో లోక్ సభ మారుమోగిపోయింది. దాదాపు గంటకు పైగా టీడీపీ, వైసీపీ ఎంపీలు లోక్ సభ కార్యకలాపాలను తమదైన శైలిలో అడ్డుకున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించి తీరాల్సిందేనని టీడీపీ ఎంపీలు ప్లకార్డులు చేతబట్టి నినాదాలు చేయగా, ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చకు అనుమతించాలని కోరుతూ వైసీపీ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రతిపాదించారు. అయితే చర్చకు లోక్ సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ అనుమతించకపోవడంతో వైసీపీ సభ్యులు నిరసనకు దిగారు. అప్పటికే స్పీకర్ పోడియంను చుట్టుముట్టిన టీడీపీ ఎంపీలతో జతకలిసిన వైసీపీ ఎంపీలు నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన విరమించాలని స్పీకర్ చేసిన విజ్ఞప్తికి ఆ రెండు పార్టీల ఎంపీలు ససేమిరా అన్నారు. ఫలితంగా సభలో గందరగోళం నెలకొనగా, లోక్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేస్తూ స్పీకర్ ప్రకటించారు.