: రాజ్యసభలో కన్నీరు పెట్టిన తమిళ ఎంపీ శశికళ
వారం రోజుల క్రితం ఢిల్లీ ఎయిర్ పోర్టులో డీఎంకే ఎంపీ తిరుచి శివపై ఏఐఏడీఎంకే ఎంపీ శశికళ చేయి చేసుకున్న విషయం తెలిసిందే. దానికిగల కారణాలు ఇప్పటికీ ఎవరికీ తెలియలేదు. దీనిపై స్పందించిన జయలలిత తమ పార్టీ నుంచి శశికళను సస్పెండ్ కూడా చేశారు. అయితే, ఈ అంశంపై ఈరోజు రాజ్యసభలో గందరగోళం నెలకొంది. ఈ అంశానికి సంబంధించిన ప్రకటన చేసేందుకు అవకాశం ఇవ్వాలని శశికళ రాజ్యసభలో డిప్యూటీ ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. ఛైర్మన్ నుంచి అనుమతి రావడంతో ఆమె సభలో ఉద్వేగ పూరితంగా మాట్లాడారు. రాజ్యసభలో ఈ అంశంపై వివరణ ఇస్తూ శశికళ కన్నీరు పెట్టుకున్నారు. తనకు ప్రాణ హాని ఉందంటూ ఆమె ఆరోపణలు చేశారు. ఈ అంశంపై తన రాజీనామాకు డిమాండ్ చేయడం సరికాదని, తాను రాజీనామా చేయబోనని ఆమె అన్నారు. ఎంపీ శశికళకు రాజ్యసభలో చాలా మంది మద్దతు తెలిపారు. తన ప్రాణాలకు హాని ఉందని, తాను తమిళనాడుకు తిరిగి వెళ్లలేనని శశికళ అన్నారు. ఇప్పటికే తిరుచి శివపై తాను చేయి చేసుకున్న అంశంపై సదరు ఎంపీకి క్షమాపణలు చెప్పినట్లు ఆమె పేర్కొన్నారు. దీనిపై శివ కూడా సానుకూలంగా స్పందించినట్లు ఆమె తెలిపారు.