: సినిమా థియేటర్లో ఇక 'ఈ నగరానికి ఏమయింది...?' దృశ్యాలు వద్దు!: శ్యామ్ బెనగళ్ కమిటీ సిఫార్సు
'ఈ నగరానికి ఏమయింది? ఓ వైపు నుసి, మరోవైపు పొగ...' అంటూ వచ్చే పొగాకు హెచ్చరిక దృశ్యాలు సినిమాల ముందు వద్దని, దీని స్థానంలో ఓ ఫోటోను చూపిస్తే సరిపోతుందని సినిమా సంస్కరణలపై శ్యామ్ బెనగళ్ నేతృత్వంలో కేంద్రం నియమించిన కమిటీ పేర్కొంది. కుటుంబంతో కలసి సరదాగా ఓ సినిమాకు వెళ్లిన వేళ, చిత్రం ప్రారంభ సమయంలో, ఆపై విశ్రాంతి తరువాత వచ్చే పొగాకు వ్యతిరేక షార్ట్ ఫిల్మ్ లు, చిత్రంలో మద్యపాన, ధూమపాన సన్నివేశాల వేళ, డిస్టర్బ్ చేసే హెచ్చరికలను తొలగించాలని ఈ కమిటీ మోదీ సర్కారుకు సిఫార్సు చేసింది. ఆరోగ్య శాఖ ఆమోదించిన ఓ ఫోటోను చూపుతూ, కొన్ని సెకన్లపాటు బ్యాక్ గ్రౌండ్ ఆడియో వినిపిస్తే సరిపోతుందని చెప్పింది. దీన్ని అన్ని భాషల్లోనూ తయారు చేసి సినిమా ప్రారంభ సమయంలో వినిపిస్తే చాలని పేర్కొంది. అలా అంగీకరించని పక్షంలో తన చిత్రంలోని నటుడితో పొగాకుకు వ్యతిరేకంగా ఓ చిన్న షార్ట్ ఫిలిం తీసి దాన్ని మాత్రమే చిత్రం ముందు ప్రదర్శించే వెసులుబాటును నిర్మాతకు కల్పించాలని కోరింది. దీనివల్ల ప్రేక్షకులు కూడా కొంత రిలీఫ్ ఫీలవుతారని చెప్పింది. చిత్రంలో ప్రతి స్మోకింగ్ లేదా డ్రింకింగ్ సీన్ ముందు వచ్చే హెచ్చరికలు, సినిమాలో లీనమైపోయిన వారిని ఆ అనుభూతి నుంచి దూరం చేస్తున్నాయని అభిప్రాయపడ్డ కమిటీ, ఈ తరహా సీన్ల ముందు హెచ్చరికను తీసివేయాలని సూచించింది. సినిమాల్లో జంతువుల వాడకం తప్పనిసరని, ఎంపిక చేసిన జంతువులను వాడుకునే వెసులుబాటును నిర్మాతలకు దగ్గర చేయాలని కూడా సిఫార్సు చేసింది. ఈ మేరకు యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకుని, కేర్ టేకర్లను నియమించుకుని తర్ఫీదు పొందిన జంతువులను షూటింగుకు వాడుకునేందుకు అంగీకరించాలని సూచించింది. కాగా, ఆరోగ్య శాఖ ఆదేశాలతో తప్పనిసరి పరిస్థితుల్లో పొగాకు ప్రకటనలను చూపుతూ, చిత్రం నిడివి పెరిగి, ఆర్థిక భారం మోయాల్సి వస్తోందని వాపోతున్న నిర్మాతలకు బెనగళ్ సిఫార్సులు కొంత ఆనందాన్ని కలిగించేవేనని సినీ పండితులు వ్యాఖ్యానించారు. మోదీ క్యాబినెట్ ఈ సిఫార్సులను ఆమోదిస్తే, పొగాకు వ్యతిరేక ప్రకటనల హడావుడి తగ్గుతుంది.