: పార్లమెంటులో టీడీపీ ఆందోళన!... బెజవాడలో లైవ్ చూస్తున్న చంద్రబాబు!
పార్లమెంటు సమావేశాలను ఏపీకి ప్రత్యేక హోదా అంశం కుదిపేస్తోంది. నేటి పార్లమెంటు సమావేశాల కోసం ఉదయమే అక్కడికి చేరుకున్న టీడీపీ ఎంపీలు మహాత్మాగాంధీ విగ్రహం ముందు ప్లకార్డులు చేతబట్టి నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత లోక్ సభలోకి వెళ్లిన ఆ పార్టీ ఎంపీలు అక్కడా నిరసనలతో హోరెత్తించారు. అయితే మొన్నటి సమావేశాల్లో తమ ఎంపీలు సరిగా వ్యవహరించలేదన్న భావనతో ఉన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న వారందరితో విజయవాడలో భేటీ అయ్యారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై ఏమాత్రం వెనక్కు తగ్గొద్దంటూ దిశానిర్దేశం చేసి పంపారు. తాజాగా తమ ఎంపీలు ఏ విధంగా ముందుకు సాగుతున్నారన్న విషయంపై చంద్రబాబు ప్రత్యక్ష పరిశీలనకు శ్రీకారం చుట్టారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలోనే కూర్చున్న చంద్రబాబు పార్లమెంటు సమావేశాల లైవ్ ప్రసారాలను టీవీలో వీక్షిస్తున్నారు.