: అలనాటి కలల రాణి, చార్లీ చాప్లిన్ హీరోయిన్ గ్లోరియా డేహెవెన్ కన్నుమూత
1940వ దశకంలో ప్రపంచాన్ని తన మధుర గానం, కట్టిపడేసే అందంతో ఓలలాడించిన నటి గ్లోరియా డెహెవెన్ కన్నుమూశారు. ఆమె వయసు 91 సంవత్సరాలు. చార్లీ చాప్లిన్ చిత్రం 'మోడ్రన్ టైమ్స్' (1936)తో తొలిసారిగా వెండితెరను అలరించిన గ్లోరియా, ఆపై ఎంజీఎం విడుదల చేసిన ఎన్నో ఆల్బమ్స్ లో ఆడి పాడి ఆనాటి కుర్రకారు కలల రాణిగా నిలిచారు. గ్లోరియా సహజ మరణం చెందినట్టు ఆమె కుమార్తె ఫించర్ ఫ్రెంకిల్ స్టీయిన్ వెల్లడించారు. మూడు నెలల క్రితం గుండెపోటు వచ్చి కోలుకున్న తరువాత, వృద్ధాప్యం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చిందని తెలిపారు. ఆమె 'థౌజండ్స్ చీర్', 'టూ గర్ల్స్ అండ్ ఏ సెయిలర్', 'స్టెప్ లవ్లీ', 'సమ్మర్ హాలిడే', 'ది డాక్టర్ అండ్ ది గర్ల్' వంటి హిట్ చిత్రాల్లో నటించారు. ఆమె చివరిగా 1997లో వచ్చిన 'అవుట్ టూ సీ' చిత్రంలో కనిపించారు. తన జీవితంలో నాలుగు వివాహాలను చేసుకున్న ఆమె, నలుగురితోనూ తన బంధాన్ని తెంచుకున్నారు.