: పట్టిసీమకు గండి దుశ్చర్యే!... పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు!
పట్టిసీమ ప్రాజెక్టుకు సంబంధించి నేటి ఉదయం వెలుగుచూసిన గండి పెను దుమారాన్నే రేపనుంది. పశ్చిమగోదావరి జిల్లా రామిలేరు వద్ద పోలవరం కుడికాలువకు గండిపడిన విషయం తెలిసిందే. గండి కారణంగా పట్టిసీమ మోటార్లు తోడుతున్న నీరంతా వృథాగా పోతోంది. దీంతో మేల్కొన్న అధికార యంత్రాంగం పట్టిసీమలోని అన్ని మోటార్లను నిలిపివేసింది. సమాచారం అందుకున్న ఏపీ జలవనరుల శాఖ మంత్రి హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ సమీక్షలో భాగంగా కాలువకు పడిన గండి దుశ్చర్యేనన్న వాదన తెరపైకి వచ్చింది. రాత్రికి రాత్రి మానవ యత్నం లేకుండా కాలువకు గండిపడే అవకాశం లేదని అధికారులు తేల్చారు. దీంతో ఎవరో గిట్టని వారే కాలువకు గండి కొట్టారని ఓ నిర్ధారణకు వచ్చారు. వెనువెంటనే రామిలేరు పరిధిలోని పోలీస్ స్టేషన్ లో అధికారులు ఫిర్యాదు చేశారు. కాలువకు గండి పడిన కారణాన్ని వెలికితీయాలని సదరు ఫిర్యాదులో అధికారులు పోలీసులను కోరారు.