: పేదలు కనపడితే 100 డాలర్లు వదిలి వెళుతున్న 'అమెరికా మల్లన్న'!
మీకు విక్రమ్ నటించిన సినిమా 'మల్లన్న' గుర్తుందిగా, పేదల కోరికలను తీర్చేందుకు డబ్బులు పంచుతుంటాడు. అచ్చూ అలాగే కాకపోయినా, తనకు తారసపడే పేదల వద్ద 100 డాలర్ల నోటు (సుమారు రూ. 6,700) వదిలి వెళుతున్నాడో అమెరికన్. అలా వదిలిన ప్రతినోటుపైనా 'బెన్నీ' అన్న సంతకం కనిపిస్తుండటంతో, ఆయన పేరు బెన్నీ అయివుంటుందని ప్రజలు భావిస్తున్నారు. ఒరిగాన్ ప్రాంతంలో చిన్న చిన్న వ్యాపారులు, చిన్న పిల్లలున్న కుటుంబాల వద్ద 100 డాలర్ల నోటు కనిపిస్తోంది. దాన్ని తీసుకుంటున్న పిల్లలు తమకు నచ్చినవి కొనుక్కుంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో గత మూడేళ్లుగా ఇలా కరెన్సీ దొరుకుతోందని స్థానికులు చెబుతుండగా, ఇప్పటివరకూ సుమారు మూడున్నర కోట్ల రూపాయలను ఇలా సదరు 'మల్లన్న' దానం ఇచ్చి వుంటాడని అంచనా. 100 డాలర్ల నోట్లను తీసుకున్నవారు సోషల్ మీడియాలో బెన్నీకి కృతజ్ఞతలు చెబుతుండగా, స్ఫూర్తిని పొందుతున్న కొందరు తాము కూడా పేదలకు సాయం చేస్తామని చెబుతున్నారు.