: ఇండోర్ జైలులో ఖైదీలకు ఇంగ్లిష్ క్లాసులు.. టీచర్ అవతారమెత్తిన సహఖైదీ, ఒకప్పటి బ్యాంక్ అధికారి

ఇండోర్ సెంట్రల్ జైలు పాఠశాలగా మారిపోయింది. కరుడుగట్టిన ఖైదీలు టీచర్ చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటున్నారు. షేక్‌స్పియర్ నాటకాన్ని వల్లె వేస్తున్నారు. జూలియస్ సీజర్, మార్క్ ఆంటోనీ సంభాషణలను బట్టీ పడుతున్నారు. నమ్మశక్యం కాకున్నా ఇది నిజం. ఫోర్జరీ కేసులో శిక్ష అనుభవిస్తున్న బ్యాంకు ఉద్యోగి బ్రిజేష్ కుమార్ పాల్(64) ఇప్పుడు సహ ఖైదీలకు గురువయ్యారు. ఇంగ్లిష్ టీచర్ కుమారుడైన పాల్ ఫోర్జరీ కేసులో జైలు పాలయ్యారు. ఎకనమిక్స్‌లో ఎంఏ పూర్తిచేసిన ఆయన బీఎస్సీ, బీఈడీ చేశారు. గత సంవత్సరకాలంగా జైలు సెల్‌లో తోటి ఖైదీలకు ఇంగ్లిష్ సాహిత్యంపై ఆయన క్లాసులు బోధిస్తూ ఖైదీల మన్ననలు అందుకుంటున్నారు. ఖైదీల్లో చాలామంది గ్రాడ్యుయేట్లు ఉన్నారని జైలు సూపరింటెండెంట్ దినేష్ నర్గావే తెలిపారు. ఖైదీల్లో చాలామంది దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశారని పేర్కొన్నారు. మరికొందరు ఎంబీఏ చదువుతున్నట్టు చెప్పారు. ఇంగ్లిష్ పాఠాలను అర్థం చేసుకోవడం వారికి కష్టం అవుతుండడంతో లిటరేచర్ క్లాసులను ప్రారంభించినట్టు వివరించారు. 46 మంది విద్యార్థుల్లో 12 మంది ఎంబీఏ చదువుతుండగా చాలామంది శిక్ష అనుభవిస్తూనే గ్రాడ్యుయేషన్ పూర్తిచేసినట్టు తెలిపారు. జైలులో జీవిత శిక్షను అనుభవిస్తున్న గణిత టీచర్ విష్ణు ప్రసాద్(40)తో కలిసి క్లాసులు ఆరంభించిన పాల్ ఖైదీలకు తెలియని మరో ప్రపంచాన్ని తన పాఠాల ద్వారా చూపిస్తున్నారు. ‘‘ఖైదీలు ఇప్పటి వరకు చూడని ప్రపంచాన్ని చూపించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం’’ అని ప్రసాద్ పేర్కొన్నారు. పాఠాలు వింటున్న ఖైదీల్లో చాలా మార్పు వచ్చిందని జైలు అధికారులు పేర్కొన్నారు. ఇక్కడి నుంచి వారు బయటపడిన తర్వాత సమాజంలో సత్ప్రవర్తన‌తో నడుచుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.

More Telugu News