: పోలవరం కుడికాలువకు గండి!... వృథాగా పోతున్న పట్టిసీమ నీరు!
దేశంలోనే నదుల అనుసంధానంలో తొలి అడుగు వేసిన పట్టిసీమ ప్రాజెక్టు వద్ద నేటి ఉదయం కలకలం రేగింది. పట్టిసీమ ప్రాజెక్టు నుంచి గోదావరి నీటిని కృష్ణా నదిలో కలుపుతున్న పోలవరం కుడికాలువకు పశ్చిమగోదావరి జిల్లా రామిలేరు వద్ద గండి పడింది. దీంతో పట్టిసీమ మోటార్లు కాలువలోకి ఎత్తిపోస్తున్న నీరంతా ఆ గండి నుంచి బయటకు పోతోంది. సమాచారం అందుకున్న అధికార యంత్రాంగం పట్టిసీమ వద్దకు పరుగులు పెట్టింది. పట్టిసీమ ప్రాజెక్టుకు చెందిన మొత్తం మోటార్లన్నింటినీ నిలిపివేశారు. రామిలేరు వద్ద ఏర్పడ్డ గండిని పూడ్చిన తర్వాతే మోటార్లను తిరిగి ఆన్ చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం రామిలేరు వద్ద గండిని పూడ్చే పనులు జరుగుతున్నాయి.