: ఎన్డీఏ నుంచి బయటకు రావడం రెండు నిమిషాల పని!... బీజేపీతో పొత్తుపై చంద్రబాబు సంచలన వ్యాఖ్య!
ఏపీకి ప్రత్యేక హోదాపై బీజేపీ వైఖరిపై టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిరసన గళాన్ని మరింత పెంచారు. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు బిల్లుపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ చేసిన ప్రసంగం నేపథ్యంలో నిన్న తన పార్టీ ఎంపీలతో విజయవాడలో కీలక భేటీ నిర్వహించిన చంద్రబాబు... కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి ఇంకా అన్యాయం చేయాలని బీజేపీ చూస్తే... ఆ పార్టీతో పొత్తు తెంచుకోవడానికి కూడా వెనుకాడేది లేదన్న రీతిలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఎన్డీఏ నుంచి బయటకు రావడం 2 నిమిషాల పని అని వ్యాఖ్యానించిన చంద్రబాబు బీజేపీ అధిష్ఠానానికి డేంజర్ బెల్స్ మోగించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంటే... కొడుకు చెప్పినా వినే పరిస్థితిలో తాను లేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అరుణ్ జైట్లీ ప్రసంగం వింటే తనకే ఒళ్లు మండిపోయిందని చంద్రబాబు అన్నారు. బయట ఉన్న తనకే ఒళ్లు మండితే... సభలో ఉన్న ఎంపీలు మాత్రం స్పందించలేకపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.