: ఇంకా వరద గుప్పిట్లోనే అసోం, బీహార్.. జాలి చూపని వరుణుడు


వరదల్లో చిక్కుకున్న అసోం, బీహార్ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. వర్షాల కారణంగా తాజాగా ఆదివారం అసోంలో మరో ఇద్దరు మృతి చెందారు. బీహార్ ఇంకా వరద గుప్పిట్లోనే ఉంది. ఇక ఒడిశాలో పిడుగుపాటుకు గత 24 గంటల్లో 45 మంది మృతి చెందారు. అసోంలో ఇప్పటి వరకు 29 మంది మృతి చెందారు. 21 జిల్లాల్లోని 16 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని 150 రోడ్లు వరద ధాటికి తుడిచిపెట్టుకుపోయాయి. 310 సహాయక శిబిరాల్లో 1.47 లక్షల మంది తలదాచుకుంటున్నారు. వరదల్లో చిక్కుకుపోయిన 1,729 మందిని ఆర్మీ రక్షించింది. వచ్చే 24 గంటల్లో అసోంలో భారీ వర్షాలు కురవడంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరికలు జారీచేశారు. వరద నీటిలో మునిగిపోయిన కజిరంగా జంతుసంరక్షణ కేంద్రం ఇప్పుడిప్పుడే బయటపడుతోంది. ఇక్కడ సంరక్షించబడుతున్న జంతువుల్లో ఇప్పటి వరకు 198 మృత్యువాత పడ్డాయి. వీటిలో 16 నీటి ఏనుగులు ఉన్నాయి. పార్క్‌లోని దాదాపు సగభాగం ఇంకా వరద నీటిలోనే ఉంది. బీహార్ పరిస్థితి కూడా మరింత దారుణంగా తయారైంది. నాలుగు జిల్లాల ప్రజలు ఇంకా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. మహానంద, బక్రా, పర్మన్, కోసి నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. 415 సహాయక శిబిరాల్లో 3 లక్షల మంది తలదాచుకున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 26 మంది మృతి చెందారు. మొత్తంగా 12 జిల్లాల్లోని 2,162 గ్రామాలకు చెందిన 27.5 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది. వరద సహాయ కార్యక్రమాల్లో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలపై సోమవారం ఐదుగురు ఇంజినీర్లను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోనూ పలు నదులు పోటెత్తుతున్నాయి. గంగా, శారదా నదులు ప్రమాదస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి.

  • Loading...

More Telugu News