: మైసూరులో ‘బీఫ్ ఫెస్టివల్’కు సిద్ధమవుతున్న దళితులు.. గోరక్షా సభ్యుల దాడులే కారణం
దళితులపై గోరక్షా సభ్యుల దాడికి నిరసనగా కర్ణాటకలోని దళితులు మైసూరులో ‘బీఫ్ ఫెస్టివల్’ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. గో మాంసం కలిగి ఉన్నారనే ఆరోపణలతో కొందరు దళితులను గోరక్షా సభ్యులుగా చెప్పుకుంటున్నవారు చితకబాదిన సంగతి తెలిసిందే. దీనికి నిరసనగా గోమాంసంతో వండిన ఆహారంతో లంచ్ చేయాలని భావిస్తున్న కర్ణాటకలోని దళిత సంఘాలు మైసూరులో ‘బీఫ్ పెస్టివల్’ నిర్వహించాలని నిర్ణయించాయి. కాగా ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్న గోరక్షా సభ్యుల దాడులు దేశంలో తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి. గుజరాత్‌లోని ఉనాలో ఆవు చర్మం ఒలుస్తున్నారనే కారణంతో నలుగురు దళితులపై బహిరంగంగా దాడిచేయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గో రక్షా సభ్యులుగా చెప్పుకుంటున్న నిందితులు ఇనుప రాడ్లు, కర్రలు, కత్తులతో దళితులను చితకబాదారు. ఈ వీడియో కాస్తా వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమన్నాయి. మరో ఘటనలో మధ్యప్రదేశ్‌లోని ఓ రైల్వే స్టేషన్‌లో ఆవు మాంసం తీసుకెళుతోందనే ఆరోపణతో ముస్లిం మహిళపై దాడిచేశారు. ఈ వీడియో కూడా ఆన్‌లైన్‌లో విపరీతంగా షేర్ అయింది. దాదాపు అరగంట పాటు గోరక్షా సభ్యులు ఆమెపై దాడిచేశారు. చెంపదెబ్బలు కొట్టారు, పిడిగుద్దులు కురిపించారు.