: చక్రం తిప్పిన హరీశ్ రావు!... మల్లన్నసాగర్ కు భూములిచ్చేందుకు ‘సింగారం’ ఓకే!


తెలంగాణలో పెను వివాదంగా మారిన మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణ అంశం రోజుల వ్యవధిలోనే తెర మరుగు కానుంది. టీఆర్ఎస్ కీలక నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వ్యూహం ముందు విపక్షాల వాదనలు ఇక ఎంతోకాలం నిలిచేలా లేవు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూసేకరణపై గడచిన కొన్ని రోజులుగా అటు రైతుల నుంచే కాకుండా ఇటు విపక్షాల నుంచి కూడా భారీ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అయితే అంతకంటే ముందుగానే ఖరారైన జపాన్ పర్యటనను చివరి నిమిషంలో రద్దు చేసుకున్న హరీశ్ రావు నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో మల్లన్నసాగర్ ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఆయన అడుగుపెట్టారు. ఇప్పటికే భూసేకరణకు మెజారిటీ గ్రామాల రైతులను ఒప్పించగలిగిన ఆయన నిన్న సింగారం గ్రామంలోనూ సానుకూల ఫలితాలను సాధించారు. స్వయంగా గ్రామానికి వచ్చి ప్రాజెక్టు ఆవశ్యకత, భూములిస్తే దక్కనున్న లబ్ధిపై హరీశ్ వివరించడంతో రైతులు ఆందోళన బాటను విడనాడారు. ప్రాజెక్టు కోసం భూములిచ్చేందుకు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఇక ప్రాజెక్టుకు భూములిచ్చేందుకు వేములఘాట్ గ్రామ రైతులు మాత్రమే నిరాకరిస్తున్నారు. వీరితోనూ స్వయంగా భేటీ అయ్యేందుకు హరీశ్ రావు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News