: హైదరాబాదును కిరోసిన్ ఫ్రీ సిటీగా మార్చే ప్రయత్నంలో పౌరసరఫరాల శాఖ
హైదరాబాదును కిరోసిన్ ఫ్రీ సిటీగా మార్చనున్నట్టు పౌరసరఫరాల శాఖ తెలిపింది. హైదరాబాదులో కాలుష్య నివారణకు చేపట్టే చర్యల్లో భాగంగా కిరోసిన్ ఫ్రీ సిటీగా మార్చే చర్యలు ప్రారంభించినట్టు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా గ్యాస్ కనెక్షన్ లేకుండా కిరోసిన్ వినియోగిస్తున్న బీపీఎల్ కుటుంబాలను గుర్తించి, వారితో గ్యాస్ వినియోగించే విధంగా చర్యలు తీసుకోనున్నారు. సర్కిల్ వారీగా గ్యాస్ కనెక్షన్ లేని కుటుంబాలను గుర్తించి, వారికి గ్యాస్ కనెక్షన్లు మంజూరు చేసే విధంగా పెట్రోలియం కంపెనీలకు ఆదేశాలు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. ఈ వ్యవహారాన్ని రేషన్ డీలర్లతో సమన్వయం చేసుకుంటారు. బీపీఎల్ కుటుంబాలను గుర్తించడం, వారిని గ్యాస్ వినియోగదారులుగా మార్చడంలో రేషన్ డీలర్లు కీలక పాత్ర పోషించనున్నారు. తద్వారా కిరోసిన్ వినియోగాన్ని పూర్తిగా నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.