: ఇద్దరు మగాళ్లయితే కీచులాడుకుంటారు... కానీ ఆడాళ్లతో రాజీకొస్తారట!
ఎక్కడైనా సరే ఒక మహిళ వుంటే కనుక అక్కడి వాతావరణం కూల్ అయిపోతుందని మార్కెటర్లు, మేనేజర్లు, వినియోగదారుల మధ్య నిర్వహించిన పరిశోధనలో నిరూపితమైందని పరిశోధకులు తెలిపారు. అమెరికాలోని కరోల్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్ నిర్వహించిన పరిశోధనల్లో భాగమైన హృష్టిన నికోలొవ మాట్లాడుతూ, ఒక టీంలో ఇద్దరు మగవాళ్లు ఉంటే ఏదైనా అంశం మీద ఒక అభిప్రాయం సాధించడం కష్టమని తెలిపారు. అదే ఇద్దరు వ్యక్తులు కలిగిన టీంలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉంటే వారి అభిప్రాయాలు కలవకపోయినా రాజీకి వచ్చేందుకు అట్టే సమయం పట్టదని చెప్పారు. అమెరికాలో రెండు విశ్వవిద్యాలయాలకు చెందిన 1.024 మంది విద్యార్ధులపై నాలుగు, 673 మంది విద్యార్థులపై ఐదు సార్లు నిర్వహించిన పరిశోధనల్లో ఇది నిరూపితమైందని వారు చెప్పారు. ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, ఒక మహిళ- ఒక పురుషుడు చొప్పున పలు జంటలుగా విభజించి, వారితో ప్రింటర్లు, టూత్ పేస్టులు, ఫ్లాష్ లైట్లు, టైర్లు, హోటల్స్, హెడ్ ఫోన్స్, లాటరీ, షేర్లు తదితరాల కొనుగోలు, విభజన వంటి పనులను అప్పగించారు. ఆ సమయంలో పురుషులు మాత్రమే ఉన్న టీంలో ఒకరిపై ఒకరు పరస్పరం ఆధిపత్యం చూపించే ప్రయత్నం చేశారని, అదే స్త్రీల జోక్యం ఉన్న టీంలలో సత్వర నిర్ణయం లేదా ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారని పరిశోధకులు తెలిపారు. ఇద్దరూ స్త్రీలే అయినప్పుడు భేషజాలకు పోకుండా ఒకరికి ఒకరు సహకరించుకుని పని పూర్తి చేసుకున్నారని వారు వెల్లడించారు.