: భారత భూభాగంపై నింగి నుంచి చైనా నిఘా!


ఉత్త‌రాఖండ్‌ లో చొర‌బాటుకు ముందు చైనా మూడుసార్లు యుద్ధ విమానాల‌తో అత్యాధునిక కెమెరాలతో సరిహద్దుల్లో భారత సైనికుల కదలికలు, చొరబాటుకు అవకాశాలను ఫోటోలు తీసి మరీ నిర్ధారించుకుని చొరబడ్డట్టు అధికారులు నిర్ధారించారు. చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఏర్పాటు చేసుకున్న అత్యాధునిక సింథ‌టిక్ అప‌ర్చ‌ర్ రాడార్ (ఎస్ఏఆర్‌) అమ‌ర్చిన యుద్ధ‌విమానాలు 60 వేల అడుగుల ఎత్తు వ‌ర‌కు ఎగ‌ర‌గ‌ల‌ సామర్థ్యం కలిగి ఉంటాయి. అంత ఎత్తు నుంచి ఎగిరినా అత్యంత స్పష్టమైన ఫోటోలు తీయగలగడం ఈ విమానాల ప్రత్యేకత. దీంతో చైనీస్ ఆర్మీకి సంబంధించిన తుపొలోవ్ టీయూ 153ఎం అనే యుద్ధ‌విమానం ఈ ఏడాది మొదట్లో మూడు సార్లు ఉత్త‌రప్ర‌దేశ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌ ల‌ గగనతలంలో సంచరించి ఫోటోలు సేకరించిందని విచారణలో అధికారులు గుర్తించారు. ఈ విమానం 40 వేల అడుగుల ఎత్తులో ఎగురుతూ ఈ ఫోటోలు సేకరించిందని, ఆ తరువాతే చొరబాట్లు చోటుచేసుకున్నాయని వారు గుర్తించారు. అంత ఎత్తున ఎగరడంతో వాటిని రాడార్లు గుర్తించ‌లేక‌పోయాయని అధికారులు తెలిపారు. కాగా, ఈ విమానానికి ఎస్ఏఆర్ సౌకర్యం ఉండడంతో వాతావరణ పరిస్థితులకు సంబంధం లేకుండా, పగలు, రాత్రి అన్న తేడాలు లేకుండా స్పష్టమైన ఫోటోలు తీసుకునే వెసులుబాటుందని వారు పేర్కొన్నారు. విదేశాలతో సమాచార మార్పిడి ఒప్పందాల వల్ల ఒక దేశానికి చెందిన ఇంటెలిజెన్స్ విభాగం అందించిన సమాచారంతో ఈ విషయాన్ని నిర్ధారించినట్టు తెలుస్తోంది. కాగా, జులై 19న ఉత్త‌రాఖండ్‌ లోని చ‌మోలి జిల్లాలో చైనా బ‌ల‌గాలు చొర‌బ‌డిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆరోజు చైనా హెలికాప్ట‌ర్ ఒకటి భారత గగనతలంలో ఐదు నిమిషాల పాటు చ‌క్క‌ర్లు కొట్టింది.

  • Loading...

More Telugu News